కరోనా వైరస్ వ్యాక్సిన్ల ట్రయల్స్ ఒక్కొక్కటిగా చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ఫార్మా కంపెనీలకు హ్యాకర్ల బెడద ఎక్కువైపోయింది. వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీలపై రష్యా, నార్త్ కొరియా హ్యాకర్లు దాడి చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. కెనడా, ఫ్రాన్స్, ఇండియా, దక్షిణ కొరియా, అమెరికా దేశాల్లో ఏడు ప్రముఖ ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయని, ఆయా కంపెనీలపై సైబర్ హ్యాకర్లు దాడి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు డజనకుపైగా ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. తాము సైబర్ దాడులను కొంత వరకు నియంత్రిస్తున్నామని.. కానీ మరింత జాగ్రత్త అవసరమని మైక్రోసాఫ్ట్ సూచించింది. హ్యాకింగ్‌కు గురవుతున్న సంస్థలకు ఇప్పటికే ఈ ఈ విషయాన్ని చేరవేసినట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. కాగా ముఖ్యంగా మూడు హ్యాకర్ గ్రూపులు ఈ దాడులకు పాల్పడుతున్నాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.