బంజారాహిల్స్ డ్రగ్స్ వ్యవహారంతో పోలీసులపై పలు విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో అధికారులతో సీపీ ఆనంద్ అత్యవసర భేటీ అయ్యారు. పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. వెస్ట్ జోన్ లోని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, డిటెక్టివ్ సీఐలు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఇక వెస్ట్‌జోన్, బంజారాహిల్స్, నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ఈ డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. పబ్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం డ్రగ్స్ ను ల్యాబ్ కు పంపారు. అలాగే సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.
ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్‌రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే కునాల్ పోలీసుల అదుపులో ఉన్నారు. పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ సాగుతోంది.
ఆదివారం ఉదయం ర్యాడిసన్ బ్లూపై పోలీసులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వెలుగుచూశాయి. యజమాని సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి వివరాలు తెలుసుకుని పంపించారు పోలీసులు. వారిలో సింగర్ రాహుల్ సిప్లింగంజ్, నటి నిహారిక ఉన్నారు. వీరిద్దరికి డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని వారి తరఫున స్టేట్ మెంట్స్ వచ్చాయి.