బోనాల ఉత్సవాలు, బక్రీద్ పండుగ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. అందుకనగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
హైదరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులతో భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కొన్ని నెలలుగా నగరంలో నిరసనలు, ప్రముఖుల రాకపోకలు, పండుగలు తదితర కార్యక్రమాలను నిర్వహించడంలో పోలీసు సిబ్బంది, అధికారులు నిర్విరామంగా పనిచేశారని తెలిపారు. అందుకు కృషి చేసిన వారిని సీపీ అభినందించారు.
బక్రీద్‌ను పురస్కరించుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీవీ ఆనంద్ వివరించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. పశువుల విక్రయ కేంద్రాల వద్ద నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వధకు పనికిరాని జంతువులను అక్రమంగా రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎక్కువ మంది యువకులతో శాంతి కమిటీలను పునరుద్ధరించాలని సీవీ ఆనంద్ చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ చౌహాన్, సంయుక్త కమిషనర్ విశ్వప్రసాద్, ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.