వరంగల్ కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి సూసైడ్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రీతి ఆత్మహత్య కేసు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. సీనియర్ సైఫ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమదు చేసుకుని వరంగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. లేటెస్ట్ గా వరంగల్ కమిషనర్ రంగనాథ్ మెడికో ప్రీతి ఘటనపై స్పందించారు. ప్రీతి మరణానికి కారణం ర్యాగింగే అని తెలిపారు. ప్రీతి మరణంపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని.. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అన్ని విషయాలు తేలుతాయని చెప్పారు. మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య విషయంలో ఆమె సీనియర్ సైఫ్ తో పాటు మరో ఇద్దరిపై అనుమానం ఉందని వెల్లడించారు సీపీ రంగనాథ్.
కాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించింది. మొదట ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు.
ఆమెను బతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. హైదరాబాద్ నిమ్స్‌లో ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. వెంటిలేటర్, ఎక్మోపై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 26 రాత్రి 9.16 గంటలకు ప్రీతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.