ఖైదీ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసిన సీఐ దేవందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గత విచారణ జరిపి సస్పెండ్ నిర్ణయం తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీఐగా పని చేస్తున్నాడు దేవేందర్. మూడు నెలల క్రితం బేగంబజార్ కు చెందిన కమల్ కబ్రా అనే వ్యక్తిని చోరీ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత అతడ్ని జైలుకు పంపారు. ఆ సమయంలో కమల్ డెబిట్ కార్డులను సీజ్ చేశారు. ఫిబ్రవరిలో ఇదంతా జరిగింది.
కమల్ బెయిల్ పై బయటకి వచ్చాక.. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయం అయ్యాయని గుర్తించాడు. బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించగా ఏటీఎం ద్వారా డ్రా అయినట్లు తెలిసింది. జైలులో ఉన్నప్పుడే అకౌంట్ నుంచి రూ.5 లక్షల వరకు డబ్బులు డ్రా అయ్యాయని నిర్ధారించుకుని ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనలో సీఐ దేవేందర్ పై అనుమానం వ్యకం చేశాడు బాధితుడు. దీంతో సీపీ మహేష్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సీజ్ చేసిన డెబిడ్ కార్డ్ ను సొంత పనులకు వాడుకున్నాడు సీఐ. తిరుపతిలో తనకు తెలిసిన మహిళకు ఇచ్చి డబ్బులు డ్రా చేయించాడు. ఈ విషయాలన్నీ గుర్తించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.