గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం మధ్య వైరం రాజకీయంగా భగ్గుమంటోంది. కేసీఆర్ ప్రభుత్వంపై తమిళిసై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై కేసీఆర్ మిత్ర పక్షంగా ఉన్న సీపీఐ రియాక్ట్ అయింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం రాజ్ భవన్ లో జరిగే గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా హిమాయత్ నగర్ మఖ్దూం భవన్ లో 74వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ తో పొత్తు కొనసాగిస్తున్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు గురువారం దేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం సీపీఐపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.