కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన యువతకు, ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ లలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు నెలకు రు.5 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత రామకృష్ణ. ముఖ్యమంత్రి జగన్ కు ఈ నేపథ్యంలోనే బహిరంగ లేఖ రాశారు. ఏపీ లోని 13 జిల్లాల్లో 9 లక్షలకు పైగా ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ లలో నమోదు చేసుకున్నారు. వీరిలో అధికశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఏర్పడిన సంక్షోభం వల్ల రాష్ట్రంలో 75 వేల మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. అమరావతి రాజధాని సమస్య వల్ల భవన నిర్మాణ రంగం కుదేలయి దాదాపు 40 వేల మంది ఉపాధి కోల్పోయారు.
ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ఫలితంగా రవాణా, వ్యవసాయ, సర్వీస్ సెక్టార్, హోటల్ రంగాలకు కోలుకొని దెబ్బ తగిలింది. కరోనా లాక్ డౌన్ ఫలితంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు రామకృష్ణ. నిరుద్యోగ యువతకు ఉపాధి లేదా ఉద్యోగం దొరికేవరకు నెలకు రు.5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాలు తీసుకున్న దళిత, బలహీన వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన 3 నెలల మారటోరియంను మరో 3 నెలలు పొడిగించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.