ఫెడరల్ వ్యవస్థను పరిరక్షించడంతో పాటు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని గురువారం రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చింది.ఈ మేరకు దాసరి భవన్ నుంచి సీపీఐ నేత రామకృష్ణ , ఇతర నేతలు ర్యాలీగా బయలుదేరారు. వారిని జిల్లా జైలు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… మోడీ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో గవర్నర్‌లను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యేలను కొనుక్కుని అడ్డదారిలో అధికారంలోకి వస్తున్నారన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ దారిలోనే ఏపీలో జగన్ పాలన సాగుతోందన్నారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని అక్రమ కేసులు పెడుతున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించకూడదా అని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అనుమతి ఇవ్వరా అంటూ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారన్నారు. మోడీ, జగన్‌లు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని రామకృష్ణ విరుచుకుపడ్డారు.