మూడు రాజధానుల పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడుతుంటే.. అమరావతి ఆవేదన అంటూ టీడీపీ సెంటిమెంట్ ఆట ఆడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తొండాట ఆడుతుంటే.. జనసేన ఏ ఆట ఆడకుండా మాటలతో సరిపెడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే… సీపీఎంది మాత్రం విచిత్రంగా దొంగాటగా మారింది. ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరు… ఆ పార్టీ అలా చేస్తుందంటే.. కాని అలాగే చేస్తుంది. మొదటి నుంచి అమరావతిపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా.. ప్రకటనల్లో ఒక రకంగాను.. కార్యాచరణలో మరో రకంగాను ఆ పార్టీ వ్యవహారం నడిపిస్తుంది.
‘‘ఇప్పుడు రాజధాని వ్యవహారంలో అన్ని పార్టీలు ఎవరి రాజకీయం వారు చేస్తున్నారు. మన ముందున్న ముఖ్యమైన సమస్య కోవిడ్. దాని నుంచి ప్రజలను రక్షించే కార్యక్రమంలో మనం బిజీ అవ్వాలి గాని.. రాజధాని విషయం పెద్ద ముఖ్యమైనదేమీ కాదు. దాని మీద మన వైఖరి స్పష్టమే. మూడు రాజధానులకు మనం వ్యతిరేకం. అమరావతి రాజధానిగా ఉండాలనేది మనం చెబుతున్నాం. అప్పుడు ఇప్పుడు రైతుల పక్షానే ఉంటాం. పోరాటం అనేది మాత్రం ఇప్పుడు అవసరం లేదు.. దాని మీద టైమ్ పెట్టాల్సిన అవసరం లేదు‘‘ ఇవి.. ఎవరో చెప్పిన మాటలు కాదు.. స్వయంగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. వారి ముఖ్యుల సమావేశంలో చేసిన గీతోపదేశం.
మామూలుగా అయితే.. ఏదైనా వైఖరి తీసుకుంటే.. తమ బలంతో నిమిత్తం లేకుండా యాక్షన్ ప్లాన్ లోకి దిగటం సీపీఎంకి అలవాటు. ఉన్నది నలుగురైనా..ముగ్గురైనా.. నిరసన తెలియచేయడం ఆపరు.. అలాంటి సీపీఎం రాజధానిపై ఎలాంటి కార్యాచరణ అవసరం లేదనే ఆలోచనలోకి వెళ్లిందంటే.. దీని వెనక ఏముందనేది ఆలోచించాల్సిన అవసరం ఉందనే కామెంట్లు వస్తున్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే.. సీపీఐ రామకృష్ణ రియాక్ట్ అయినంతగా.. సీపీఎం మధు రియాక్ట్ కారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించగానే.. నిరసన కార్యక్రమం ఒకటి జరిగింది విజయవాడలో.. సీపీఎం ఆధ్వర్యంలో. అందులో పాల్గొన్నది.. సీపీఎం నేత బాబూరావు. ఈయన తప్ప.. ఇంక వేరే పెద్దలెవరూ పాల్గొనలేదు. పార్టీ వైఖరిని ప్రజలకు తెలియచేసే ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమంలో మధు పాల్గొనకపోవటానికి కారణమేంటో తెలియదు మరి.
ఇప్పుడే కాదు.. అమరావతి రైతులు ఆందోళనకు దిగినప్పటి నుంచి.. ఇదే తంతు నడుస్తోంది. కేవలం బాబూరావు మాత్రమే యాక్టివ్ గా అప్పటికి ఇప్పటికి ఉన్నారు. పార్టీ కార్యదర్శి మధు మాత్రం.. అమరావతి ఉద్యమం మొదలైన నెలల తర్వాత మేలుకుని.. అప్పటికి కూడా బాగోదనుకున్నారేమో మరి.. రైతులను పరామర్శించడానికి అమరావతి వచ్చారు. ‘‘రైతులు పొలాలు ఇవ్వకండి అని మేం చెప్పాం.. అయినా మా మాట వినలేదు. మమ్మల్నే అడ్డుకున్నారు. ఇప్పుడు ఇలా జరిగింది.’’ అంటూ.. ఒక విదంగా.. మా మాట వినలేదుగా.. ఏం జరిగిందో చూశారుగా అన్న టైపులో కామెంట్ చేశారు. అలా అంటీముట్టనట్లుగానే అమరావతి ఉద్యమంతో వ్యవహారం నడిపించారు మధు.
ఇప్పుడు కూడా అదే స్టయిల్ లో రాజకీయం నడిపిస్తున్నారు సీపీఎం నేతలు. పార్టీ వైఖరి మాత్రం సరిగానే ఉందని.. అమరావతిలో రాజధాని అనేదానికి కట్టుబడి ఉన్నామని.. మూడు రాజధానులకు వ్యతిరేకమని క్లియర్ గానే చెబుతున్నారు. కాని ఎలాంటి కార్యక్రమం అవసరం లేదంటూ మమ్మల్ని కట్టడి చేస్తున్నారని కొందరు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఇలా చేస్తే.. బిజెపి వైఖరికి.. మాకూ తేడా ఏముందని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. బిజెపి కూడా ఇలాగే చెబుతుంది.. కాని ఆచరణలో మూడు రాజధానులకు మద్దతిస్తోంది. ఇప్పుడు సీపీఎం కూడా అంతేనా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని ఆ కార్యకర్తలు వాపోతున్నారు. సీపీఎం కార్యదర్శి మధు.. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడని.. జగన్ ఇన్ ఫ్లూయెన్స్ చేస్తుండటం వల్లే.. మధు ఆ విధంగా వ్యవహారం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఎవరికీ దొరకని అపాయింట్ మెంట్ మధుకు జగన్ నుంచి దొరుకుతుందని.. ప్రభుత్వంలో కావాల్సిన పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. పైకి ఒక రకంగా మాట్లాడుతూ.. ఆచరణలో మరో రకంగా వ్యవహరిస్తూ.. మొత్తం మీద సీపీఎం దొంగాట ఆడుతుందనే విమర్శలు వస్తున్నాయి.