సీఎం కేసీఆర్ భారత్ సమితి పార్టీ(బీఆర్ఎస్)ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది. మోడీ హయంలో దేశం ప్రమాదకర స్థాయిలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న భారత్ రాష్ట్ర సమితిని స్వాగతిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్రెడ్డి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మతతత్వ బీజేపీని వ్యతిరేకించే వారిలో కమ్యూనిస్టుల తర్వాత ఆ స్థాయిలో కేసీఆర్ ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ జాతీయ స్థాయి అజెండా ఆకట్టుకునేలా ఉందని చెప్పారు. కేసీఆర్ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
అత్యంత ప్రమాదకర పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయన్నారు. అమెరికా తరహాలో అధ్యక్ష పాలన భారతదేశంలో నెలకొల్పాలని మోదీ భావిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టడం శుభ పరిణామన్నారు. వారి విధానాలు.. మా విధానాలు వేరు కావచ్చు.
కానీ ఇక్కడ ప్రధానాంశం బీజేపీని వ్యతిరేకించే వాళ్లలో కమ్యూనిస్టుల తరువాత కేసీఆర్ ఉన్నారు. గుజరాత్ మోడల్ వెనక్కి పోయింది. తెలంగాణ మోడల్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ మద్దతు ఇచ్చామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.