బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే జనసేన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పోరాటానికి సిద్ధం అవుతోంది. త్వరలో ఆపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తారని ప్రకటించారు జనసేన ప్యాక్ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అసలు ఈ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ పెద్దలతో పవన్ మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారయన. అయితే రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. కేంద్రంపై పవన్ పోరాటం ఎంత వరకు నమ్మాలనే ప్రశ్న తెరపైకొస్తోంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పవన్ చేసే పోరాటంపై తమకు నమ్మకం లేదని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. 222 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే పవన్ కు కనపించలేదా..? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో చేసిన ఆందోళనకు వైసీపీ వచ్చిందన్న ఆయన.. జనసేన రాలేదని సెటైర్లు వేశారు. అసలు.. ఢిల్లీలో పవన్ కు పలుకుబడి ఉంటే గట్టిగా వారిని ఎందుకు అడగడం లేదని నిలదీశారు నారాయణ.
Advertisements
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమేనని… ఆ శక్తి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఉందని చెప్పారు నారాయణ. ఈ అంశంపై ఆయన స్పందించాలన్నారు. పవన్ కళ్యాణ్ కు చేతకాకపోతే చెప్పాలని… ప్రజలను మాత్రం మోసం చేయొద్దని కోరారు.