నేటి నుంచి ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర -2 మీద సీపీఐ నారాయణ స్పందించారు. ఇది అమరావతి రైతుల రెండో పోరాటమని పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని వైస్ జగన్ హామీ ఇచ్చారని, కానీ సీఎం అయ్యాక ఆయన గుణం మారిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పాదయాత్రలు, ర్యాలీలంటే.. ఎందుకు సీఎంకి కోపమని ప్రశ్నించారు. మీరు, మా నాన్న కూడా పాదయాత్రలు చేసే ముఖ్యమంత్రులు అయ్యారని సీఎం జగన్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం పదవి నుంచి జగన్ దిగిపోవాలన్న ఉద్దేశంతో రైతులు పాదయాత్ర చేయడం లేదని, కేవలం అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారని వెల్లడించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. రైతులు చేపట్టిన ఈ మహా పాదయాత్ర ‘ధర్మయాత్ర’ అని పేర్కొన్నారు. రాజధాని పేరు చెప్పి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తున్నారని.. రాజధాని వికేంద్రీకరణ ప్రపంచంలోనే ఎక్కడ లేదని అన్నారు. ‘మొదట కులాల మధ్య విద్వేషాలు సృష్టించారు.. ఇపుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. విశాఖను రాజధానిగా నియమిస్తే.. రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కావాలని కోరలేదని.. అభివృద్ధి కావాలన్నారని చెప్పారు. అమరావతి రాజధానికి బిజేపి కట్టుబడి ఉందని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.