దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందంటూ సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అదానీ మాయలఫకీరు కంటే దారుణంగా తయారయ్యాడని దుయ్యబట్టారు. ప్రభుత్వ సంస్థల నుంచి మెజార్టీ ఇన్వెస్ట్ మెంట్ లు అదానీ సంస్థలకు ట్రాన్స్ ఫర్ చేసింది. సెబీ, సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు అదానీకి పిచ్చి కుక్కలలెక్క కాపలా కాస్తున్నాయన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులను పట్టిపెట్టడానికి పని చేస్తున్నాయన్నారు. బీజేపీ నాయకులు అత్యాచారాలు చేసినా పూలమాలలు వేసి బయట తిప్పుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు, నేతలు కలవాలి. బీఆర్ఎస్ పార్టీ మొదట్లో బీజేపీతో కలిసి పని చేసినా.. ఇప్పుడు వ్యతిరేకంగా ఉందన్నారు.
సీపీఐ పార్టీ నాయకులు సన్యాసులు కాదు.. మా పార్టీ మఠం కాదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. సీపీఐ పార్టీ అధికారంలోకి రావాలని మాకూ ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డికి, మాకు వ్యక్తి గతంగా ఎలాంటి విభేధాలు లేవన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్, సీపీఐ కలుస్తున్నాయనే వార్తలను నారాయణ ఖండించారు.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి వంటి దుర్మార్గుడు లేడన్నారు. పొలిటికల్ పార్టీ కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదన్నారు. జగన్ లాంటి పరమ దుర్మార్గున్ని నా రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. జగన్.. నారా లోకేష్ ని పప్పు అన్నాడు.
మరి ఆ పప్పు పాదయాత్ర చేస్తే ఎందుకు ఆపుతున్నారు?. జగన్ దృష్టిలో చంద్రబాబు ముసలోడు.. మరి ఆ ముసలోడి రోడ్ షోలను ఎందుకు అడ్డుకుంటున్నారు?, చీమ కూడా పోని ప్రాంతంలో వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడు? అంటూ ప్రశ్నల వర్గం కురిపించారు సీపీఐ నేత నారాయణ.