బీజేపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ.. మోడీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీకి జై కొట్టకపోతే.. జైలుకు పోతావ్ అంటూ ప్రతిపక్ష పార్టీలను ప్రధాని మోడీ ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు.
బయ్యారం ఇనుప రాయి బలమైంది కాదంటున్నారని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని పోరాటం చేయడాన్ని నా చిన్నతనం నుండే చూస్తున్నామని, గిరిజన యూనివర్సిటీకి 50 కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల సాధనకు సీఎం కేసీఆర్ అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్ లో కొట్లాడాలన్నారు.
సింగరేణి బొగ్గును కాదని, అదాని దిగుమతి చేసుకునే బొగ్గును తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, బీజేపీకి వ్యతిరేక రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ లో పని చేసిన వారిని గవర్నర్ లు గా నియమిస్తున్నారన్నారు. కేంద్ర క్యాబినెట్ లోని 24 మంది మంత్రులపై కేసులు ఉన్నాయని, చుట్టూ దొంగలను పెట్టుకుని మోడీ పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా నియమించి అటవీ చట్టాలను ప్రక్షాళన చేసి అటవీ భూములను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టే యత్నం జరుగుతుందన్నారు. వచ్చే నెల 14 నుంచి మే వరకు మోడీ హఠావో.. దేశ్ కి బచావో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.