ఏపీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఏపీ మంత్రులు మూకుమ్మడిగా కేటీఆర్ పై దండయాత్ర కూడా చేశారు. జగన్ పాలన ఆదర్శం.. మా పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తున్నాయి అంటూ వరుసబెట్టి విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని అయితే.. తెలంగాణకు కూడా జగనే సీఎం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
కేటీఆర్ టైమ్ ఇస్తే ఏపీ అంతా తిప్పి చూపిస్తానని మంత్రి రోజా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వెనక్కి తగ్గి సారీ చెప్పారు. జగన్ తో సోదరభావంతో ఉంటానని ఓ ట్వీట్ చేశారు. అయితే.. కేటీఆర్ కామెంట్స్.. ఏపీ మంత్రుల కౌంటర్స్ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓ డెమో ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. ఏపీలో రోడ్ల దుస్థితిని కళ్లకు కట్టేలా ఓ వీడియో చేశారు.
ఏపీ మంత్రుల వ్యాఖ్యలను తప్పుబట్టిన నారాయణ.. కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని రోడ్ల గురించి వివరించారు. ఏపీ రోడ్లు.. తమిళనాడు రోడ్ల స్థితిగతులను వీడియో తీసి చూపించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని.. తమిళనాడు రోడ్లు చక్కగా ఉన్నాయని తెలిపారు.
ఈ రెండింటి మధ్య పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు నారాయణ. నగరి మండలం తన స్వగ్రామమైన అయణంబాకం గ్రామానికి వచ్చే రోడ్ల పరిస్థితి చూడండి అని వీడియోలో వివరించారు.