ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రియాక్ట్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో వైసీపీ తీరుపై మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి? వారు మనుషులా? లేక పశువులా? అంటూ ప్రశ్నించారు.
ఈ ఘటనలో స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరిదీ తప్పు ఉందని చెప్పారు. స్పీకర్, సీఎం జగన్ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం, సీఎం పదవి శాశ్వతం కాదని పేర్కొన్నారు నారయణ. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని మండిపడ్డారు.
గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప.. ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక ఇలా కొడతారా? అని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ, నిస్పృహల్లో ఉందన్నారు నారాయణ.
నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరీ దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. అయినా ఓడిపోవడంతో నిరాశలో కూరుకుపోయారని ఎద్దేవా చేశారు నారాయణ. అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రేపు నువ్వు అటు వైపు ఉంటావు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలని కోరారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం మాని, బాధితులను సస్పెండ్ చేయడం తగదన్నారు. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని పేర్కొన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.