విశాఖ రైల్వే జోన్ సాధించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఇదే విషయం మీద ఏపీ పార్లమెంట్ సభ్యులు గళమెత్తాలన్నారు. దేశ వ్యాప్తంగా 17 రైల్వే జోన్లు ఉన్నాయని.. కొత్తగా రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఆలోచన లేదని రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించడాన్ని ఆయన ఖండించారు.
2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం గుర్తు చేశారు. నాయకత్వం మారితే ఇచ్చిన హామీలను ప్రజలు మరవరనేది గుర్తుంచుకోవాలని రామకృష్ణ అన్నారు.