ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్ రమేష్ కుమార్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. నగదు పంపిణీ చేసిన వైసీపీ అభ్యర్థుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లేఖలో పేర్కొన్నారు రామకృష్ణ. పదేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చే వెయ్యి రూపాయల కరోనా ఆర్థిక సహాయాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులు చేత ప్రజలకు ఇప్పించారు. ఇది ఎన్నికల నియమావళిని, చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇప్పటికే దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు, పోలీసులచే అక్రమ కేసుల బనాయింపు వంటి అనైతిక చర్యలకు పాల్పడిన వైసీపీ రాష్ట్రంలో ఏకగ్రీవ స్థానాలను గెలుచుకున్నట్లుగా ప్రకటించుకుంది.
అనేక లోపాలు, అధికార పార్టీ ప్రలోభాలతో ఇప్పటివరకు కొనసాగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు.