దేశాన్ని లూటీ చేస్తున్న కేంద్ర సర్కారును గద్దె దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం జరిగిన ఆన్ లైన్ బహిరంగ సభలో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. కరోనాను నియంత్రించడంలో కేంద్రం చేతులెత్తేసిందని ఆరోపించారు. దేశ ఆర్థిక రంగంలో పెద్ద సంక్షోభం వచ్చిందని.. అందుకే ధరలు పెరుగుతున్నాయన్నారు. అధికంగా ధరలు పెంచి.. పెద ప్రజలపైన భారం వేసి..దేశ సంపదను లూటీ చేస్తున్నారని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు.
దేశాన్ని అమ్ముకోండి.. పొలిటికల్ ఫండ్ గా బీజేపీకి కేటాయించండని రాష్ట్రాలకు చెప్తున్నారని విమర్శించారు. దేశంలో 112 మంది మహా కోటీశ్వరులు ఉన్నారని.. ప్రజల వద్ద ఉన్న సంపదలో 55 శాతం వారి చేతుల్లోనే ఉందని అన్నారు. రాజ్యాంగంలోని కీలక స్తంభాలను ధ్వంసం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తున్నారని వ్యాఖ్యానించారు. 12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసి.. పార్లమెంటులో ఎలాంటి చర్చలు జరగకుండా చేసి.. పార్లమెంటును రబ్బర్ స్టాంప్ లా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
సీబీఐ, ఈడీలను తన రాజకీయ ఏజెన్సీలుగా బీజేపీ ఉపయోగించుకుంటోందని అన్నారు. తనకు లొంగని ప్రతిపక్షనాయకుల మీద కేసులు పెడుతూ హింసిస్తోంది అని విమర్శించారు. సీపీఎం పార్టీ పాత వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని.. తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఏచూరి పిలుపునిచ్చారు.
రైతులు, మహిళల కోసం ఎర్రజెండా పోరాడుతోందని పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. రాష్ట్రం విడిపోయాక బంగారు తెలంగాణ తెస్తామని పాలకులు ఆశ చూపారని.. కానీ ఆశలు అడియాశలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దొరల తెలంగాణ కాకుండా ప్రజా తెలంగాణ సాధించుకునే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.