కార్పొరేట్లకు అనుకూలమైన ప్రజావ్యతిరేక సంస్కరణలనపై పోరాటమే పుచ్చలపల్లి సుందరయ్యకు అందించే నిజమైన నివాళని సిపిఎం నేత సిహెచ్ బాబూరావు అన్నారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు, ఈ సందర్భంగా ప్రజలకు భోజనం, అల్పాహారం, పండ్లు, మజ్జిగ ఇతర పానీయాల పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ అనేక అంశాల మీద సమీక్షలు చేసే ముఖ్యమంత్రి పెరిగిన విద్యుత్ చార్జీలపై నోరు మెదపక పోవటం శోచనీయమని ఇప్పటికైనా కొత్త చార్జీలు, కొత్త స్లాబులు నిలిపివేయాలని కోరారు. పోలీసులతో విద్యుత్ ఉద్యమాలను అణచి వేయాలనుకోవడం గర్హనీయమన్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై భవిష్యత్లో ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు.
విద్యుత్ చార్జీలపై బీజేపీ నేతల నిరసన ఒక డ్రామా…! కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రజలపై విద్యుత్ భారాలు మరింత మోపడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్రాల హక్కులు హరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటువంటి విద్యుత్ చార్జీల పెంపుదలపై బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు బాబు రావు. పెరిగిన విద్యుత్ బిల్లుల మీద, కేంద్ర విద్యుత్ చట్టసవరణల మీద ప్రజలు పోరాడాలి. ప్రభుత్వాలు మద్యం పంపిణీ చేస్తుంటే కమ్యూనిస్టులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా తత్పరులు ప్రజలకు భోజనం, ఇతర సహాయం చేస్తున్నారు. లాక్ డౌన్ మొదలై మూడు నెలలు దగ్గర పడుతున్నా వెయ్యి రూపాయలు మాత్రమే సహాయం చేయడం సిగ్గు చేటు. ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు చొప్పున మూడు నెలలకు ఆర్థిక సహాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి. నాణ్యమైన రేషను 16 రకాల నిత్యావసరాలు ప్రతి కుటుంబానికి అందించాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసిన వైసీపీ, నేడు కమ్యూనిస్టులు, ప్రజలు చేస్తున్న ఉద్యమాలను అణచి వేయడానికి, అరెస్టులకు పూనుకోవటం గర్హనీయమన్నారు బాబు రావు.