విద్యుత్ బిల్లులపై పునఃపరిశీలన చేసుకోకుండా సమర్ధించుకోవడం ప్రభుత్వానికి తగదన్నారు సిపిఎం నేత హెచ్.బాబూరావు.నగరంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి పెరిగిన విద్యుత్ బిల్లులను సిపిఎం నేతలు పరిశీలించారు. విద్యుత్ బిల్లులపై అధికారులు,ప్రభుత్వ పెద్దలు ఇచ్చే వివరణలు ప్రజలను సంతృప్తి పరచలేక పోతున్నాయన్నారు బాబు రావు. ఏప్రిల్ నుండి పెంచిన విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు చెల్లించడానికి జూన్ నెలాఖరు వరకు సమయం ఇచ్చామని ఒకవైపున చెబుతూ, ఆలస్యమైనందుకు పెనాల్టీలు ఎందుకు వసూలు చేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బిల్లులు చెల్లించకపోయినా కనెక్షన్ కట్ చేయమని చెబుతున్న అధికారులు రీకనెక్షన్ చార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలన్నారు.
విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటి ఉందనే సాకుతో బియ్యం కార్డులు రద్దు చేసే మరో ప్రమాదం పొంచి ఉంది. 200 యూనిట్ల లోపు వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలు జరుగుతుందా? లేదా? అని ప్రశ్నిచారు. విద్యుత్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సవరణలు తీవ్ర ప్రమాదకరమన్నారు. మోడీ ప్రభుత్వం తెచ్చే ఈ సవరణ వలన పేదలపై రెండు, మూడు రెట్లు విద్యుత్ చార్జీలు పెరిగే ప్రమాదం ఉందని ఆరోపించారు. విద్యుత్ పంపిణీ ప్రైవేటు సంస్థల పరమయ్యే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కు ఎసరు పెడుతున్నారు. రాష్ట్రాల అధికారాలను హరించి కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మోడీ ప్రభుత్వం ఈ విద్యుత్ సవరణను ఉపసంహరించుకోవాలని కోరారు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయని,సొంత ఇల్లు ఉందని,ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఉన్నాయనే సాకుతో రద్దు చేసిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి ఉన్న కార్డులు, పెన్షన్లు రద్దు చేయడం అన్యాయమన్నారు.