కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. తొలి భారతీయ గవర్నర్ జనరల్ సీ. రాజగోపాల చారి మునిమనువడు సీఆర్ కేశవన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. ఆ లేఖను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రెండు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం తాను పని చేసేలా ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం పార్టీలో కనిపించడం లేదని ఆయన అన్నారు. ఇలా చెప్పడం తనకు బాధగా అనిపిస్తోందన్నారు. కానీ దేనికైతే పార్టీ గుర్తుగా ఉందో, దేని కోసం మద్దతుగా నిలుస్తోందో, దానితో తాను ఏకీభవిస్తున్నట్లు మనస్ఫూర్తిగా చెప్పలేనన్నారు.
ఇక తాను ఏ మాత్రం కాంగ్రెస్ వ్యక్తిననే గుర్తింపుతో ఉండలేనని ఆయన లేఖలో వెల్లడించారు. అందుకే తాను జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత బాధ్యతను తిరస్కరించానని పేర్కొన్నారు. అందుకే తాను భారత్ జోడో యాత్రకు కూడా హాజరు కాలేదని చెప్పారు.
ఇప్పుడు తాను నూతన మార్గాన్ని నిర్మించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాబట్టే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందన్నారు. తాను మరొక పార్టీలో చేరుతానని ఊహాగానాలు రావచ్చన్నారు.
కానీ తాను ఎవరితోనూ మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. తదుపరి ఏం జరగబోతోందో తనకు నిజంగా తెలియదన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు పదవులు కేటాయించిన సోనియాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.