తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో క్రేన్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాణిపేటలోని ద్రౌపతి ఆలయంలో ఆదివారం ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో అమ్మవారి విగ్రహాలు క్రేన్ పై పెట్టారు. ఆ సమయంలో క్రేన్ ఒక్క సారిగా కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పొంగల్ తర్వాత ఆ ఆలయంలోద్రౌపతి అమ్మన్ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సారి కూడా ఊరేగింపు జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో క్రేన్ పై నుంచి కొందరు కిందపడగా, మరికొందరు కిందకు వేలాడుతూ కనిపిస్తున్నారు.
క్రేన్ కూలిపోవడంతో భయంతో భక్తులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకుని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇ క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.