గుంటూరు: ప్రజావేదిక మాదిరిగానే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేస్తారా? అసలు లింగమనేని ఇంటికి అనుమతి ఉందా? లేదా? సీఆర్డీఏ అధికారులు అనుమతిలేదని, వారంలో ఖాళీచేయాలని మళ్ళీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు లింగమనేని రమేష్ పేరుతో జారీ అయ్యాయి. ఇంటి యజమాని లింగమనేని రమేష్ మాత్రం ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని అంటున్నారు. ఇల్లు నిర్మించే సమయంలో సీఆర్ డీఎ లేదని, ఉండవల్లి పంచాయతీ అనుమతితో నిర్మాణం చేశామని చెబుతున్నారు. స్విమ్మింగ్ పూల్‌కు రివర్ కన్సర్వేటర్ అనుమతి ఉందని లింగమనేని రమేష్ స్పష్టం చేశారు.
గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్, ఫస్ట్ ఫ్లోర్‌లోని డ్రెసింగ్ రూమ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది అక్రమకట్టడమేనని, వారంలో ఖాళీ చేయకపోతే కూల్చివేత ఖాయమని అధికారులంటున్నారు. సీఎం జగన్ ఎలాగైనా లింగమనేని ఇంటిని కూల్చివేయాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అందుకే నోటీసులపై నోటీసులు జారీ అవుతున్నాయి. కరకట్ట వెంట ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేస్తారా? లేక లింగమనేని ఇల్లు ఒక్కటే కూల్చి సంతృప్తి చెందుతారా? అనేది ఆసక్తికరంగా ఉంది.