కృష్ణా కరకట్ట అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన జగన్ సర్కార్ ఇదే దూకుడుతో చంద్రబాబు ఇంటిని కూడా రేపోమాపో కొట్టేస్తుందా..? రాజధానిలో ప్రస్తుతం ఇదే హాట్ డిస్కషన్!
రాజధాని పరిధిలోని కృష్ణా నది కరకట్ట పొడవునా నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 24 కట్టడాల యజమానులకు ప్రాధమిక నోటీసులు జారీ అయ్యాయి. వాటికి యజమానులు ఇచ్చిన వివరణను పరిశీలించిన ఏపీసీఆర్‌డీఏ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. నోటీసులు అందుకున్న వారందరూ ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదని అధికారులు ఒక అభిప్రాయానికి రావడంతో ఇక దూకుడు పెంచారు. సెక్షన్ 115 (3) ప్రకారం ఐదు నిర్మాణాలను తొలగించేందుకు తుది ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగానే పాతూరు కోటేశ్వరరావు పొలంలో నదీ తీరంలో వేసిన కాంక్రీటు ర్యాంపును తొలగించారు. తాను పొలంలోనే ర్యాంపు నిర్మించానని, పొలం కోతకు గురి కాకుండా అలా ఏర్పాటు చేసుకున్నానని, అది నివాసం ఉండేందుకు కాదని పాతూరి కోటేశ్వరరావు స్పష్టం చేశారు.
మిగిలిన 19 మంది యజమానుల వివరణలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వీరిలో కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని హౌస్ కూడా చట్టవిరుద్ధమైన నిర్మాణమేనని చెప్పారు. అది సక్రమమేనని యజమాని లింగమనేని రమేష్ వాదిస్తున్నారు. ఈ నిర్మాణం విషయంలో ఏమి జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
మిగతా నిర్మాణాల విషయంలో కోర్టు ఏమిచెబుతుంది? సీఆర్డీఏ చర్యలు ఏమిటి? అసలు భవిష్యత్‌లో కరకట్ట వెంట నిర్మాణాలు నిషేధిస్తూ కచ్చితమైన చట్టం ప్రభుత్వం తెస్తుందా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.