టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నాడు ధావన్. ప్రస్తుతం బాలీవుడ్ లోకి ధావన్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పలు వార్తలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. హ్యూమాతో కలిసి శిఖర్ ధావన్ డ్యాన్స్ చేస్తున్న ఫొటో ఒకటి నెట్టింట హల్చల్ అవుతోంది. దీనిపై ధావన్ క్లారిటీ కూడా ఇచ్చాడు.
ప్రముఖ హీరోయిన్లు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డబుల్ ఎక్స్‌ఎల్’. ఇందులో ధావన్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇందులో ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్ చేసింది.
కాగా తన మూవీ ఎంట్రీపై తాజాగా మీడియాతో మాట్లాడు శిఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం తరపున ఆడే నా లాంటి అథ్లెట్ లైఫ్ లో క్షణం కూడా ఖాళీ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను తీరిక చేసుకుని అప్పుడప్పుడు సినిమాలు చూస్తూంటా. ఈ మూవీ ఆఫర్ నాకు వచ్చినప్పుడు ముందు స్టోరీ విన్నాను. అది నా మనసును తాకింది. ఈ చిత్రం సమాజానికి మంచి మెసేజ్ ఇస్తుంది. మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదని.. మన కలలను ఎలా నెరవేర్చుకోవచ్చన్న విశ్వాసాన్ని నింపుతుందని శిఖర్ ధావన్ తెలిపారు.
ఈ సినిమాకి సతరమ్ రమానీ దర్మకత్వం వహిస్తున్నారు. ఇందులో సోనాక్షీ, హ్యూమా ఖురేషీ లావుగా ఉండే అమ్మాయిల్లా కనిపించనున్నారు. సమాజంలో బొద్దుగా ఉండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన డబుల్ ఎక్స్ఎల్ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది.