అర్జున్ రెడ్డి ఫేమ్ శాలినీ పాండేపై క్రిమినల్ కేసు నమోదైంది. యాక్షన్ థ్రిల్లర్ తమిళ్ డ్రామా ‘అగ్ని సిరగూగల్’ సినిమాలో నటించడానికి ఇటీవల శాలిని పాండే ఒప్పందం చేసుకుంది. అయితే 27 రోజుల షూటింగ్ తర్వాత ఆమె అకస్మాత్తుగా ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. సినిమాలో నటించడానికి తిరస్కరించారు.
నిర్మాత టి.శివ మిగతా షూటింగ్ అంతా పూర్తి చేసి వెళ్లాల్సిందిగా కోరినప్పటికీ శాలిని పాండే అంగీకరించడం లేదు. దీంతో ఆ నిర్మాత శాలినిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విషయాన్ని తమిళ, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాడు. అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న అగ్ని సిరగూగుల్ సినిమాకు నవీన్ దర్శకత్వం వహిస్తుండగా…విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్, అక్షర హాసన్, నస్సార్, ప్రకాశ్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
శాలిని పాండేకు హిందీలో రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించే అవకాశం రావడంతో దక్షిణాది సినిమాల పట్ల ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. శాలిని పాండే తెలుగులో విజయ్ దేవరకొండ కథా నాయకుడిగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో శాలినికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మహానటి, ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘జయేష్‌భాయ్ జోర్దార్’ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ దొరికింది. అది గాక రణ్ వీర్ సింగ్ కామెడీ ఫిల్మ్ లో కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. 2020 జనవరి 31న విడుదలయ్యే అనుష్క శెట్టి బహుభాషా చిత్రం నిశబ్ధం లో కూడా శాలిని పాండే నటించింది.