మాజీ సీఐ నాగేశ్వర్ రావు కేసులో 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. ఈ 600 ఛార్జ్ షీట్ లో 75 మంది సాక్ష్యులను పోలీసులు చేర్చారు. వీటిని ఎల్బీ నగర్ కోర్టులో దాఖలు చేశారు. మాజీ సీఐ నాగేశ్వర్ రావు నేరం చేశారనడానికి తగిన ఆధారాలను పొందుపర్చారు. సీసీటీవీ ఫుటేజ్, డీఎన్ఏ రిపోర్ట్, యాక్సిడెంట్స్, వెపన్ దుర్వినియోగం, బాధిరాలి స్టేట్ మెంట్ లను ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కోర్టులో అన్ని ఆధారాలను పోలీసులు సడ్మిట్ చేశారు.
ఇటీవలె సీఐ నాగేశ్వరరావు రావును సర్వీస్ నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున ఆర్టికల్ 311(2) బి కింద సర్వీస్ రిమూవల్ చేశారు. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాయగా.. లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది.
జూలై 7వ తేదీన వనస్థలిపురం పీఎస్ లో నాగేశ్వర్ రావుపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు, కిడ్నాప్ చేయించాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జూలై11వ తేదీన నాగేశ్వర్ రావును అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత 18వ తేదీన కస్టడీలోకి తీసుకొని ఐదు రోజుల పాటు విచారించారు. నాగేశ్వర్ రావు అత్యాచారం చేశారనడానికి తగిన ఆధారాలు సేకరించారు.
మహిళ లోదుస్తుల్లో నమూనాలు సేకరించి, నాగేశ్వర్ రావు డీఎన్ఏతో సరిపోల్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఈ రెండు మ్యాచ్ అయ్యాయి. అలాగే సీసీ కెమెరా దృశ్యాలను సైతం పరిశీలించారు. నాగేశ్వర్ రావు సెల్ ఫోన్ ను కూడా చెక్ చేసిన పోలీసులు, అత్యాచారం జరిగిన సమయంలో మహిళ ఇంట్లోనే ఉన్నట్లు తేల్చారు. మహిళ నివాసం ఉండే ఇంటి కాపలాదారుతో పాటు… చుట్టుపక్కల వాళ్ల సాక్ష్యాలను నమోదు చేశారు. వీటన్నింటిని కూడా పోలీసులు ఇప్పుడు ఛార్జ్ షీట్ లో పొందుపర్చారు. ఈ కేసు విచారణ ఎల్బీ నగర్ కోర్టులో కొనసాగుతోంది. కాగా అత్యాచారం చేసిన కేసులో జైలుకెళ్లిన నాగేశ్వర్ రావు ఇటీవలె బెయిల్పై విడుదలయ్యారు.