మయన్మార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ దేశ సైనికులు తిరుగుబాటు ప్రకటించారు. సైనికులు తిరుగుబాటు చేసి… ప్రముఖ నేత అంగ్‌సాన్ సూకీని అదుపులోకి తీసుకున్నారు. మయన్మార్ మిలటరీ దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీని ప్రకటించింది.
మయన్మార్‌లో ఎన్నికల అనంతరం అనిశ్చితి నెలకొంది. అక్కడ ప్రభుత్వానికి, మిలటరీకి మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత అంగ్‌సాన్ సూకీతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను సైనికులు అదుపులోకి తీసుకున్నారని సూకీ పార్టీ తరఫు ప్రతినిధులు వెల్లడించారు.
ఇప్పటికే మయన్మార్‌లోని కీలక పట్టణమైన యాంగోన్ సిటీ హాల్ బయట సైనికులు మోహరించినట్లు సమాచారం. మయన్మార్ వ్యాప్తంగా ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. అయితే మయన్మార్ మిలటరీ కుట్రపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాల ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తాము జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.