– టీఆర్ఎస్ అధినేతకు ఏమైంది?
– 10 రోజుల టూర్ అని 2 రోజుల్లోనే వెనక్కి
– ప్రధాని వస్తున్నారని బెంగళూరు పయనం!
– అన్నాహజారేని కలుస్తానని వాయిదా!
– పర్యటనలతో ప్రయోజనం ఎవరికి?
– ప్రజాధనం వృధా దేనికి?
– రాజకీయ విశ్లేషకుల ప్రశ్న
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చేస్తున్న పర్యటనలు ఎవరి కోసమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. సంచలనాలు జరగబోతున్నాయని ప్రకటనలు చేయడం టీఆర్ఎస్ అధినేతకు కామన్ అయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆయన చేసే పనులు కూడా చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్న చందంగా ఉంటున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అని గతంలో పేర్కొన్న కేసీఆర్.. ఇటీవల కాలంలో పర్యటనలు విరివిగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతానని, దేశవ్యాప్తంగా మార్పు అవసరమని చెప్తున్నారు. కానీ.. అంతలోనే ఉన్నఫలంగా సొంత రాష్ట్రానికి వచ్చేశారు. ఈ వ్యవహారశైలి సబబేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ పర్యటన పది రోజులు ఉండబోతోందని తెలిపిన కేసీఆర్.. రెండు రోజుల్లోనే హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు.
బెంగళూరు వెళ్లాక అటునుంచి జార్ఖండ్, రాలేగావ్ సిద్ధిలలో పర్యటనలు ఉంటాయని భావిస్తే.. అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు. హైదరాబాద్ కు ప్రధాని వచ్చిన సమయంలోనే కేసీఆర్ ఈ గందరగోళ పర్యటనలు చేయడం చూసి.. ఆయన తెగ కంగారు పడిపోతున్నారని సెటైర్లు వేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రజా ధనాన్ని ఇలా తన సొంత రాజకీయ స్వార్థం కోసం తాగు నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయని.. ఆయనకు ఏదో అయిందనే చర్చను కూడా తెరపైకి తెస్తున్నారు. బహుశా ఈసారి తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడం కష్టమేననే తన అంతర్గత సర్వేల ద్వారా తెలుసుకుని పరేషాన్ అయి.. ఇలా గజిబిజి పర్యటనలతో సతమతమవుతున్నారా?అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.