రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రంలో దళిత సంఘాలు, విద్యార్ధులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. తక్షణమే తన సీఎం పదవికి రాజీనామా చేసి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం చేసిన కామెంట్స్ కు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భీం దీక్షలో పాల్గొన్నారు లక్ష్మణ్. పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం పట్ల కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై దేశం ఆశ్చర్యపోయిందన్నారు.
బడ్జెట్ పై నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యాంగం విషయం ఎందుకు వచ్చిందో అర్థంకావడం లేదన్నారు. రెండేళ్లకు పైగా శ్రమించి.. 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ ఒక్క మాటతో అవమానించారని అన్నారు.
అసమానతలు కూడిన దేశంలో సమానతలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన మహనీయులు అంబేడ్కర్ అని కొనియాడారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల పరిపాలన సులభం అవుతుందని చెప్పిన వ్యక్తి అంబేడ్కర్ అని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని గౌరవించాల్సిన టీఆర్ఎస్ బహిష్కరించి అవమానపరిచిందని మండిపడ్డారు లక్ష్మణ్.