– కరోనా కారణంగా మోడీ ప్రోగ్రాంకి వెళ్లలేదన్న సీఎం
– కానీ.. ఒకరోజు గ్యాప్ లో యాదాద్రి టూర్
– మాస్క్ లేకుండానే ప్రారంభోత్సవాలు
– భౌతిక దూరం పాటించకుండా సభలు, సమావేశాలు
– మరి.. అప్పుడు రెస్పాన్సిబులిటీ ఏమైంది?
– కేసీఆర్ కు ప్రతిపక్షాల ప్రశ్నలు
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా స్వాగతం చెప్పేందుకు సీఎం కేసీఆర్ వెళ్లలేదు. ఎందుకు వెళ్లలేదంటే ఆరోగ్య సమస్య అని సీఎంఓ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. అంతకుముందు ప్రెస్ మీట్ లో మోడీని ఆహ్వానిస్తానని చెప్పి.. చివరి నిమిషంలో కేసీఆర్ వెళ్లకపోవడంపై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. శిలాఫలకం విషయంలో కేసీఆర్ హర్టయ్యారనే చర్చ నడిచింది. తాజాగా మోడీకి ఎందుకు స్వాగతం చెప్పలేదో వివరణ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో అసలు విషయం ఇదేనంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తన ఇంట్లో ఇద్దిరికి కరోనా సోకింది.. అక్కడకు చాలామంది ప్రజలు వస్తారు.. ఇలాంటి సమయంలో మోడీ కార్యక్రమానికి వెళ్లడం కరెక్ట్ కాదని భావించి వెళ్లలేదని అన్నారు కేసీఆర్. తాను ఎడ్యుకేటెడ్ మ్యాన్.. రెస్పాన్స్ బుల్ పర్సన్ అని చెప్పుకుంటూ.. ప్రెసిడెంట్ కు స్వాగతం తెలిపానుగా అని తెలిపారు. తనకు ప్రోటోకాల్ తెలుసు.. గౌరవించడం తెలుసని వివరించారు. కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తెరపైకి తెస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇంట్లో ఇద్దరికి కరోనా ఉందని మోడీకి స్వాగతం చెప్పని సీఎం.. ఒక్కరోజు గ్యాప్ లో యాదాద్రి ఎందుకు వెళ్లారు..? పైగా.. ఆలయ పరిసరాల్లో కొంతసేపు మాస్క్ లేకుండానే తిరిగారు. ఇదేనా రెస్పాన్సిబులిటీ..? చుట్టూ పదుల సంఖ్యలో నాయకులు, అధికారులు.. సోషల్ డిస్టెన్స్ అనేది మచ్చుకైనా కనిపించలేదు. ఇదేనా ఎడ్యుకేటెడ్ మ్యాన్ జ్ఞానం అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
యాదాద్రి టూర్ తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి.. జనగామ టూర్ కు వెళ్లారు కేసీఆర్. ముందుగా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మాస్క్ తోనే బస్ దిగి అందరికీ అభివాదం చేస్తూ.. నాలుగు అడుగులు ముందుకేసి తీసేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. మళ్లీ మాస్క్ పెట్టారు. రెండు అడుగులు వేయగానే మళ్లీ తీసేశారు.. ఇన్నిసార్లు పెట్టుడు తీసుడు ఏందని చిరాకు పుట్టిందో ఏమోగానీ.. మళ్లీ కార్యక్రమం అయ్యే వరకు మాస్కే పెట్టలేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ బహిరంగసభలో పాల్గొన్నారు. అసలు.. అక్కడకు అయితే మాస్క్ లేకుండానే బస్ దిగారు. ఇక యాదాద్రి టూర్ లోనూ అంతే.. కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో నో మాస్క్. బహిరంగ సభ ప్రారంభంలో కాసేపు పెట్టుకున్నా కుర్చీలో కూర్చోగానే తీసేశారు. ఆ తర్వాత పెట్టుకున్నది లేదు.
కరోనా సాకుతో మోడీ కార్యక్రమానికి వెళ్లని సీఎం.. ఈ కార్యక్రమాల్లో మాత్రం కరోనా జాగ్రత్తలు ఎందుకు పాటించలేదనేది ప్రతిపక్షాల ప్రశ్న. మాస్క్ లేకుండా తిరగడం.. టీఆర్ఎస్ నేతలకు కరచాలనం చేస్తూ కనిపించడం.. భౌతికదూరం పాటించకపోవడం చూసి.. ఇదేనా మీరు చెప్పిన రెస్పాన్సిబులిటీ అని సెటైర్లు వేస్తున్నారు.