– ఒకరెనుక ఒకరు రాష్ట్రంలో పర్యటిస్తున్న బీజేపీ నేతలు
– టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారా..?
-టీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ కంకణం కట్టుకుందా..?
– అఫీషియల్ ప్రోగ్రాం కోసం హైదరాబాద్ కు వచ్చిన కేసీఆర్ ను విమర్శించడానికా..?
– లేక ప్రజల్లో మెప్పు పొందడానికా..?
– ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా..?
– కాదంటే రాజకీయం ప్రస్థావన ఎందుకు..?
– పీఎం వచ్చినప్పుడు సీఎం కలవకపోవడానికి కారణాలేంటి..?
– రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా..?
– రాష్ట్రంలో జోరందుకున్న చర్చ
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు బీజేపీ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు బీజేపీ కంకణం కట్టుకుందా..? అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇటీవల అమిత్ షా, అంతకు ముందు నడ్డా, ఇప్పుడు ప్రధాని మోడీ.. ఇలా ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్ లో పర్యటించడానికి గల కారణాలు ఏంటి..? అఫీషియల్ ప్రోగ్రాంకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని.. రాష్ట్ర రాజకీయాల గురించి మాత్రమే మాట్లడానికి గల కారణాలు ఏంటి..? అనే కోణంలో చర్చ జోరుగా జరుగుతోంది.
అయితే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మోడీ చేసిన ప్రసంగంలో.. మోడీ కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్ధేశించి మాట్లాడినట్టే ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ ది కానీ, కేసీఆర్ ది కానీ పేరు పెట్టకుండానే ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని మోడీ విమర్శించారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అంతేకాకుండా.. కేంద్ర పథకాల పేర్లు మారుస్తూ తమ పథకాలుగా కేసీఆర్ చలామణి అవుతున్నారనే కోణంలో మోడీ విమర్శలు చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో తమ ప్రభుత్వమే అధికారం చేపట్టనుందని మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అఫీషియల్ ప్రోగ్రాం పేరుతో హైదరాబాద్ కు వచ్చింది కేసీఆర్ ను టార్గెట్ చేయడానికేనా..? లేక ప్రజల్లో మెప్పు పొందడానికా..? ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా..? అనే కోణంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో పర్యటించిన ఏ బీజేపీ నేత అయినా కేవలం కేసీఆర్ అవినీతిపరుడు అనే కోణంలోనే మాట్లాడటంతో బీజేపీ వ్యూహం ఏమిటి..? ఓ వైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ.. కేంద్ర మంత్రులు సహా కేసీఆర్ గురించే మాట్లాడటానికి కారాణాలు ఏమిటి..? అసలు బీజేపీ వ్యూహ రచన ఏంటి..? అనే కోణంలో చర్చ జోరందుకుంది. ఇప్పటి వరకు విమర్శలే కానీ.. కేసీఆర్ అవినీతిపైన చర్యలు తీసుకుంటామని ప్రధాని హోదాలో ఉన్న మోడీ కానీ.. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న అమిత్ షా కానీ.. ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనక ఉన్న అంతర్యం ఏమిటి..? ఇలాంటి అనేక అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఓ వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మరో వైపు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఒకరిని పట్టక ఒకరు రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని విమర్శలు చేయడం తప్ప.. ఇటు సీబీఐ కి కానీ.. అటు ఈడీ కి కానీ.. రాతపూర్వకమైన దరఖాస్తు ఎందుకు ఇవ్వట్లేదు..? గతంలో జగన్ పైన ఫిటీషన్ వేసినట్టు.. ఇప్పుడు కేసీఆర్ అవినీతిపైన ఎందుకు ఫిర్యాదు చేయట్లేదు..? అనే విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఇదంతా పొలిటికల్ మైలేజ్ కోసమేనా..? అన్నట్టు చర్చ జరుగుతోంది.
నువ్ తన్నినట్టు చేయ్.. నేను గుద్దినట్టు చేస్తా అన్నట్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇలాంటి లోపాయకార ఒప్పందాలేమైనా ఉన్నాయా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు. ప్రజలను మభ్యపెట్టేందుకు రెండు ప్రభుత్వాలు ఆడుతున్న జూదమా..? లేక ఇది రాజకీయ చదరంగమా..? అని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజం అయితే.. ఈ రాజకీయ జూదంలో బలి అయ్యేది ప్రజలేనా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి.
మరోవైపు.. పీఎంను కలిసి రాష్ట్రానికి కావల్సిన ప్రయోజనాల గురించి చర్చించాలంటే.. అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని.. కేంద్ర మంత్రులు టైం ఇవ్వట్లేదని విమర్శలు చేసే సీఎం కేసీఆర్.. ఆయన తెలంగాణకు వచ్చినప్పుడు కలవచ్చు కదా..? ఢిల్లీ టూర్ చేయడం ఎందుకు..? అంటూ ప్రజలు కౌంటర్ ఇస్తున్నారు. పక్క రాష్ట్ర సీఎం స్టాలిన్ పీఎంను కలిసి వారి సమస్యల గురించి వివరించినట్టు.. పీఎం రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పడే కేసీఆర్ ఎందుకు వివరించడం లేదు..? అసలు పీఎంను కలిసేందుకు కేసీఆర్ ఎందుకు సంకోచిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఏం జరుగుతోంది..? ఎవరు లేనప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పితే.. ఎదురెదురుగా కలిసి మాట్లాడుకోకపోవడానికి కారణాలు ఏంటి..? ఇద్దరి మధ్య ఉన్నది ఒప్పందమా..? లేక విరోధమా..? అనేది మాత్రం అర్ధం కావడంలేదంటున్నారు రాష్ట్ర రాజకీయ పండితులు.