10 ఏళ్లుగా చెన్నై జట్టులో అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగిన జడేజా.. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన కెప్టెన్ ధోనీ, జట్టు యాజమాన్యం ఈ సీజన్ కు ముందు రూ.16 కోట్లు వెచ్చించి మరీ మరో సారి కొనుగోలు చేసింది. అంతేకాకుండా టోర్నీ ప్రారంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ పగ్గాలు సైతం అందజేసింది చెన్నై ప్రాంచైజీ.
అయితే.. ఆటగాడిగా విఫలమవ్వడమే కాకుండా.. చెన్నై టీం ను ప్లే ఆఫ్స్ కు దూరం చేశాడనే విమర్శలు వినిపించాయి.అందుకు కారణం నాయకత్వ బాధ్యతలతో జడేజా తీవ్ర ఒత్తిడికి గురవడమేనంటున్నారు క్రికెట్ అభిమానులు. దీంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి జడేజాను తప్పించి.. మరోసారి ఆ బాధ్యతలను ధోనీ అప్పగించింది చెన్నై టీం యాజమాన్యం. ఇక జడేజా కెప్టెన్సీ వదులుకున్నాక మే 4న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.
ఫీల్డింగ్ చేస్తుండగా ఒక క్యాచ్ అందుకునే క్రమంలో పక్కటెముకలకు గాయమైంది. కానీ.. ఆ రోజు జడేజా ఫీల్డింగ్ కొనసాగించి, తర్వాత బ్యాటింగ్ కూడా చేశాడు. ఆ తర్వాత మే 8న ఢిల్లీతో ఆడిన మ్యాచ్ లో తుది జట్టులో లేడు. గాయం కారణంగా అతడు ఆడట్లేదని జట్టు యాజమాన్యం పేర్కొంది. కానీ.. చెన్నై జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చేసిందని.. జట్టు నుంచి తొలగించిందని అభిమానులు మండిపడుతున్నారు.
తర్వాత అతడు కూడా చెన్నైని అన్‌ఫాలో చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే విషయమై స్పందించిన చెన్నై టీం సీఈవో కాశీవిశ్వనాథన్.. ఎలాంటి అవాంతరాలు లేవని వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలను తాను వాడనని.. అక్కడ ఏం జరుగుతోందనే విషయాలు తనకు తెలియవని చెప్పాడు. కానీ.. జడేజా మాత్రం భవిష్యత్తులో కచ్చితంగా చెన్నైతోనే కొనసాగుతాడని వెల్లడించాడు విశ్వనాథన్.