గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు వల్ల అనేక నదులు పొంగి పొర్లుతున్నాయి. గుజరాత్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశ్వామిత్ర నది పొంగి ప్రవహించింది. విశ్వామిత్ర నది 250 మొసళ్లకు ఆశ్రయమిస్తోంది.
నదికి వరదలు రావడంతో ఆ నీరు వడోదరలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.నీటితోపాటు మొసళ్లు కూడా పట్టణంలోకి కొట్టుకువచ్చాయి. దగ్గరలో ఉన్న అపార్టమెంట్లలోకి అవి ప్రవేశించాయి.
దీంతో భయాందోళనలకు గురైన అపార్ట్ మెంట్ వాసులు.. తమ ఇంటి ఆవరణలోకి మొసళ్లు వచ్చాయంటూ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దాంతో వాటిని పట్టుకునేందుకు పలు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా కొట్టుకువచ్చిన మొసళ్లలో చిన్నవి, పెద్దవి కూడా ఉన్నాయి. డ్రైనేజీల్లో ఎన్నో కిలోమీటర్ల మేర అవి కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పలు ప్రాంతాల్లో మొసళ్లను బంధించి తీసుకెళ్లారు.