సర్కార్ నిర్లక్ష్యం.. అకాల వర్షం అన్నదాతను నిండా ముంచేశాయి. మొన్నటి వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతన్నను మరోమారు దెబ్బతీశాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకునే సమయంలో వర్షానికి నీటి పాలైంది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఈదురుగాలులు కూడా బలంగా వీచాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.
భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతన్న తల పట్టుకొని బోరుమంటున్నాడు. ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో నీటపాలు కావడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని కుప్పలు చేసే ప్రయత్నంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండడంతో ధాన్యం కుప్పలు వరదనీటిలో మునిగిపోయాయి. తూకం వేసిన వరి ధాన్యం బస్తాలు కూడా వర్షానికి తడిసి పోయాయి. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా త్వరగా కొనుగోళ్లు చేయాలని రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా వడ్ల బస్తాలను రైస్ మిల్లులకు వెంటవెంటనే తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
తెలంగాణలో ఇంకో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెబుతున్నారు అధికారులు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ ఈమధ్యే ప్రకటించింది. పక్షం రోజుల వ్యవధిలోనే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి.