ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అన్నిస్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో గులాబీ శ్రేణులు యమ జోష్ లో ఉన్నారు. అయితే ఖమ్మం స్థానంలో జరిగిన క్రాస్ ఓటింగ్ గులాబీల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. ఖమ్మం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తాతా మధు గెలుపొందారు. అయితే కాంగ్రెస్ పార్టీకి వారికి ఉన్న ఓట్లు కంటే ఎక్కువ రావడం ఆసక్తికరంగా మారింది.
టీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. తమ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ కు ఓటు వేసింది ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ అసంతృప్త నేతలు ఎవరై ఉంటారా అని ఆరాలు మొదలయ్యాయట. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీపై సెటైర్లు వేస్తున్నాయి. అధిష్టానంపై పార్టీ నాయకుల్లో అసహనం ఉందనడానికి ఇదే ఉదాహరణ అని చురకలంటిస్తున్నాయి.
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై స్పందించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. టీఆర్ఎస్ పార్టీ అతి కష్టం మీద గెలిచిందన్నారు. గులాబీ పార్టీలో ఉన్న ఓటర్లు కూడా తమకే జై కొట్టారని.. కాంగ్రెస్ కు అభ్యర్ధే లేరని హేళన చేసిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం చెబుతారని కౌంటర్ వేశారు. సంఖ్యాపరంగా టీఆర్ఎస్ గెలిచినా.. నైతిక విజయం మాత్రం కాంగ్రెస్ దేనని చెప్పారు భట్టి. అధికార పార్టీ క్యాంపు రాజకీయాలు చేయకపోయి ఉంటే ఓటమి చవిచూసేదని ఎద్దేవ చేశారు.