న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లోని ఆలయాలు కిటకిటలాడాయి. ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. బిర్లా మందిర్ కు జనం పోటెత్తారు. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి..కొత్త ఏడాది ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ చాలా పెరిగింది. ఆదివారం, ఇంకా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారు జామున నుంచే స్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరారు.
ధర్మదర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. కొండపైన బస్ బే, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. ఇక ఓరుగల్లులోని శ్రీ భద్రకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు.
నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవీ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. యువతీ యువకులు సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.