స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దగ్గర పడుతుండడంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రమూకల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. దక్షిణ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా క్రాల్ చక్ ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు కొనసాగించాయి.
సోమవారం అనంత్ నాగ్ లోని లాల్ చౌక్ లో రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్ తోపాటు ఆయన భార్యపై ఉగ్రమూకలు కాల్పులు జరిపి చంపేశాయి. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు అధికారులు. క్రాల్ చక్ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుండగా కాల్పులు జరిపారు ముష్కరులు. అనంతరం ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. ఘటనా స్థలంలో కొన్ని తూటాలు మాత్రమే లభ్యమయ్యాయి.