పుల్వామా దాడిలో నాడు ప్రాణాలు కోల్పోయిన 40 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారం నివాళులర్పించారు. ఈ రోజు మనం ఆ అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటిస్తున్నామని, కానీ ఇంటెలిజెన్స్ వర్గాల ఘోర వైఫల్యం వల్లే వారు అమరులయ్యారని ఆయన అన్నారు. వారి కుటుంబాల సభ్యులందరికీ తగిన పునరావాసం లభించి ఉంటుందని తాను ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.
2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ సూసైడ్ బాంబర్ ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నాడు జమ్మూ నుంచి శ్రీనగర్ కు 78 బస్సుల్లో సుమారు 2,500 మంది జవాన్లు ప్రయాణిస్తుండగా పుల్వామా జిల్లాలో .. బాంబులతో కూడిన తన వాహనంతో ఈ సూసైడ్ బాంబర్ … సెక్యూరిటీ కాన్వాయ్ లోకి దూసుకువచ్చి ఢీకొట్టాడు.
ఈ ఘటన తో పాక్ పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా అనేకమంది నేతలు దీన్ని ఖండించారు. ఆ తరువాత ఇందుకు ప్రతీకార చర్యగా ఫిబ్రవరి 26 న పాకిస్తాన్ లోని బాలాకోట్ పై ఇండియా వైమానిక దాడులు జరిపింది. ఆ దాడుల్లో పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు మరణించారు.
నిజానికి పుల్వామా దాడి జరగడానికి ఆరు రోజుల ముందే కశ్మీర్ ఐజీ నుంచి ..ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఈ ముప్పునకు సంబంధించి
హెచ్చరికలు వెళ్ళాయని, అయితే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కూడా అప్పటికే వార్నింగ్ ఇచ్చిందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. మన ఇంటెలిజెన్స్ సంస్థలు దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనబడలేదని, కావాలనే రాంగ్ రూట్ లో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తన వాహనంతో జవాన్ల కాన్వాయ్ ని ఢీకొట్టాడని ఆయన అన్నారు.
.