ఛత్తీస్ గఢ్ లో సామూహిక వివాహాలు జరిపించారు సీఆర్పీఎఫ్ జవాన్లు. ప్రజల్లో పోలీసుల పట్ల భరోసా కల్పించేందుకు సీఆర్పీఎఫ్ జవాన్లు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సామూహిక వివాహాలు జరిపించి వధూవరులకు కానుకలను కూడా అందజేశారు.
ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లు 12 జంటలకు వివాహం చేశారు. అలాగే నూతన దంపతులకు జీవిత బీమా సౌకర్యంతో పాటు రూ.1100 నగదు, ఇతర కానుకలను జవాన్లు అందజేశారు.
సామూహిక వివాహ సమయంలో కొందరు సీఆర్పీఎఫ్ జవాన్లు పెళ్లి కుమార్తెలకు సోదరులుగా, మరికొందరు పెళ్లి కుమారులకు బంధువులగా ఉండి సంప్రదాయ పద్ధతిలో వివాహాలను జరిపించారు.
మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు పోలీసులు అంటే భయం పోయి.. భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జవాన్లు పేర్కొన్నారు. ఈ సామూహిక వివాహాలను నిర్వహించిన 2వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లను జిల్లా కలెక్టర్ అభినందించారు.