కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్న వారంతా వెనక్కి వచ్చేస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఆసియా దేశాల నుండి పెట్టుబడులు 26 బిలియన్ డాలర్లు వెనక్కివెళ్లిపోయాయని ఆ నివేదిక సారాంశం. ఇందులో ఒక్క భారత్ నుండే 16బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కితగ్గాయని తెలుస్తోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేస్తూ అమెరికాకు చెందిన కాంగ్రెస్ పరిశోధన సంస్థ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం…
ఐరోపా దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ దేశాల్లో దాదాపు 3కోట్ల మంది ప్రభుత్వ సహాయం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. తొలి క్వార్టర్ లో ఆర్థిక వృద్ధి 3.8శాతం తగ్గిపోయిందని, 1995 తర్వాత ఇదే మొదటిసారి అని తెలిపింది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, 4.8శాతం జీడీపీ తొలి క్వార్టర్ లో తగ్గిందని తెలిపింది.
ఇక ఆసియా దేశాల్లో చైనా, భారత్, ఇండోనేషియా దేశాల మినహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం ఉంటుందని సీఆర్ఎస్ నివేదిక తెలిపింది. ఈ మూడు దేశాలపై కూడా ప్రభావం ఉన్నప్పటికీ… 2020లోనే ఈ దేశాలు ప్రతికూలతలను అధగిమిస్తాయని ప్రకటించింది.