తెలంగాణలో 80 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్ఏలు ఎట్టకేలకు తమ సమ్మె విరమించారు. రేపటి నుంచి వీఆర్ఏలు విధుల్లోకి వెళ్లనున్నారు. ఈ మేరకు బుధవారం వీఆర్ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో సీఎస్ సోమేశ్ కుమార్ నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. ఆయన హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో వీఆర్‌ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు.
ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పేస్కేల్, ఉద్యోగ భద్రత, ప్రమోషన్ల విషయాలకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లు పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని, చర్చల అనంతరం రవీందర్ రెడ్డి ప్రకటించారు. వీఆర్‌ఏల డిమాండ్లకు అనుగుణంగానే కొత్త పే స్కేలు తీసుకురానున్నట్లు చెప్పారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున.. వచ్చే నెల 7వ తేదీ నుంచి కొత్త పే స్కేల్‌ను అమలు చేయనున్నట్లు సీఎస్ అన్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. వీఆర్‌ఏలు బుధవారం నుంచి విధులకు హాజరవుతారని రవీందర్ రెడ్డి వెల్లడించారు.
ఇక తమ సమస్యల పరిష్కారం కోసం గత 80 రోజులుగా నిరాహార దీక్షలకు దిగిన వీఆర్ఏలు… తమ సమస్యలు పరిష్కారం అయితేనే సమ్మె విరమిస్తామని భీష్మించారు. ఈ క్రమంలో పలువురు వీఆర్ఏలు కూడా చనిపోయారు. అయినా కూడా వీఆర్ఏలు వెనక్కు తగ్గలేదు. ఇటీవలే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అప్పుడు వీఆర్ఏలు ప్రస్తావించిన ప్రధాన డిమాండ్లకు సూత్రప్రాయంగా కేటీఆర్ అంగీకారం తెలుపగా…తాజాగా సీఎస్ ఆ డిమాండ్ల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోనే వీఆర్ఏలు సమ్మె విరమించారు.