గ్రూప్-4 పోస్టుల నోటిఫికేషన్ జారీపై ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన భేటీకి.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పలువురు అధికారులు హాజరయ్యారు.
గ్రూప్-4 పరిధిలో 9,618 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ ప్రక్రియపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 29 లోపు టీఎస్‌పీఎస్సీకి వివరాలు పంపాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయించడం జరిగిందన్నారు. మిగిలిన ఐదు శాతం కూడా స్థానికులకే దక్కుతాయని వివరించారు.
ఇప్పటికే గ్రూప్-1తో పాటు పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. పోలీస్ జాబ్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నవి గ్రూప్-4 ఖాళీలే. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటు.. గ్రూప్-2కు సంబంధించి 582 పోస్టులు, గ్రూప్-3కి సంబంధించి 1,373 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.