ఐపీఎల్-2023 చివరి దశకు చేరుకుంది. క్వాలిఫయర్-1లో గుజరాత్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సందర్భంగా అరుదైన ఫీట్ సాధించింది. గత సీజన్ లోనే గుజరాత్ టైటాన్ ఐపీఎల్ లో అడుగు పెట్టింది. గతేడాది టైటిల్ కూడా గెలుచుకుంది. ఈసారి కూడా ఫుల్ స్పీడ్ తో ఆడుతూ టాప్ ప్లేస్ లో నిలిచింది. కానీ, క్వాలిఫయర్-1లో ఓడిపోయింది. అయితే.. ఈ టీమ్ కు ఇంకో ఛాన్స్ ఉంది. క్వాలిఫయర్-2లో గెలిచిన టీమ్ తో తలపడుతుంది. అందులో గెలిచినవాళ్లు ఫైనల్ కు చేరతారు. చెన్నైతో ఢీ కొడతారు.
అయితే.. ఐపీఎల్ లో గుజరాత్ ఇప్పటివరకు 31 మ్యాచ్ లు ఆడగా చెన్నైతో మ్యాచ్ కు ముందు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు. కానీ, సీఎస్కే మాత్రం.. ఈ విషయంలో గుజరాత్ అన్ బీటన్ రికార్డును చెరిపేసింది. 30 మ్యాచుల్లో ఎవరికీ సాధ్యం కాని పనిని.. సీఎస్కే చేసి చూపించడంతో నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. గుజరాత్ 30 మ్యాచుల ఐపీఎల్ ప్రస్థానంలో కేవలం రెండింటిలో మాత్రమే 9 వికెట్లు కోల్పోయింది. అలాగే, ఆ జట్టు ఛేదనలో కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే ఓడింది.
ఇక.. జరిగిన 16 సీజన్లలో చెన్నై 14 ఆడింది. 12 సార్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది. తాజాగా గుజరాత్ పై గెలిచి ఏకంగా 10వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆల్రెడీ 4సార్లు కప్పు గెలిచిన ధోనీసేన.. ఐదోసారి కప్ పైకెత్తేందుకు ఉవ్విళ్లూరుతోంది. 2008లో టోర్నీ మొదలైనప్పటి నుంచి చెన్నైకి ధోనీనే కెప్టెన్ గా ఉన్నాడు. ఓ సీజన్ లో జడేజాకు పగ్గాలు అప్పగించినా.. తిరిగి ధోనీనే తీసుకోవాల్సి వచ్చింది. ఈ టీమ్ లో మేజర్ ప్లస్ పాయింట్ ధోనీనే. టీమిండియా కెప్టెన్ గా ఆల్రెడీ అద్భుతాలు చేసి.. చెన్నై తరఫున వికెట్ల వెనుక అంతకు మించిన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు.
ఐపీఎల్ లో సీఎస్కే ప్రయాణం సాగిందిలా..!
2008 – (రన్నరప్)
2009 – (ప్లే ఆఫ్స్)
2010 – (విజేత)
2011 – (విజేత)
2012 – (రన్నరప్)
2013 – (రన్నరప్)
2014 – (ప్లే ఆఫ్స్)
2015 – (రన్నరప్)
2016 – ఆడలేదు
2017 – ఆడలేదు
2018 – (విజేత)
2019 – (రన్నరప్)
2020 – ఏడో స్థానం
2021 – (విజేత)
2022 – తొమ్మిదో స్థానం