చెన్నయ్ సూపర్ కింగ్స్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నయ్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేలు విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశారు.
ఈ జోడీ మొదటి వికెట్ కు ఏకంగా 181 పరుగులు జోడించింది. దీంతో ఐపీఎల్ లో ఏ వికెట్ కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా రుతురాజ్, కాన్వేల ద్వయం రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నయ్ జట్టు పరుగుల వరద పారించింది. ఓపెనర్ రుతురాజ్ 99( 6 ఫోర్లు, 6 సిక్సర్ల)తో బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 85(8 ఫోర్లు, 4 సిక్సర్ల)తో సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(39), కేన్ విలియమ్ సన్ (47) శుభారంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత నికోలస్ పూరణ్ (64) ఒంటరి పోరు చేశాడు. కానీ మిగతా వారు పెద్దగా రాణించకపోవడంతో 20ఓవర్లతో 189 పరుగులు చేసి ఓటమి పాలైంది.