ఉక్రెయిన్ లోకి ఎంటర్ అయిన రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తూ ముందుకు పోతున్నాయి. ఇటు మేమేమన్నా తక్కువా అని ఉక్రెయిన్ సైన్యం దీటుగా పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో దాడుల్ని సమర్ధించుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్.
తమ దాడి ఉక్రెయిన్ ప్రయోజనాల ఉల్లంఘన కాదన్నారు పుతిన్. ప్రస్తుత దాడి సంఘటనలకు దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బందీలుగా పట్టుకున్న వారిని రష్యాకు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాల నుంచి రక్షణ కోసమే ఇదంతా జరుగుతోందని వివరించారు.
మరోవైపు ఇప్పటిదాకా 40 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. అలాగే 10మంది పౌరులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అలాగే రష్యా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించిన ఉక్రెయిన్.. 50 మంది సైనికుల్ని హతమార్చినట్లు తెలిపింది.
ఇప్పటికే రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకుంది ఉక్రెయిన్. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.