రియాల్టి రంగానికే అపర్ణ ఓ ట్రెండ్
ఇన్నాళ్లు మచ్చ లేని బ్రాండ్ ఇమేజ్
అపర్ణ కూడా అన్నిసంస్థలలాగానే మారిందా..?
120 మందితో ఉన్న వివాదానికి తెరదించిన రాజులు.?
రాజులకు ఉన్న భూమి ఎంత.. ఎంత పొజిషన్ ఇచ్చారు.?
పేట్ బషిరాబాద్ లో మూడెకరాల కబ్జా నిర్వాకమెవరిది?
అప్రమత్తం చేసినా మేలుకోని అపర్ణ!
హైదరాబాద్,తొలివెలుగు క్రైంబ్యూరో: అపర్ణ సెరినిటీ పేరుతో పేట్ బషీరాబాద్ లో 1499 అపార్ట్ మెంట్లు నిర్మిస్తోంది. ప్రచారంలో,పర్మిషన్ లో 22 ఎకరాల 20 గుంటల భూమి లో చేపట్టామని అంటున్నారు.120 మందితో కలిసి ఉన్నవివాదాన్ని క్లియర్ చేసుకున్న భూములు ఉన్నాయి.ప్రభుత్వం 1965లో అగ్రి ఇండ్రస్టియల్స్ వారికి కేటాయించిన భూములను 2008లో అప్పటి ప్రభుత్వం నుంచి సర్వే నెంబర్ 25/1 లో తామే ఉన్నామంటూ.. రెవెన్యూ రికార్డుల్లో క్లియరెన్స్ తీసుకున్నారు రాజుల కుటుంబం. రోజు రోజుకు రేట్లు ఆకాశాన్నిఅంటడం..పక్కనే ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండటం కలిసొచ్చిందని భావించేశారు.ఇంకేముంది మూడెకరాల ప్రభుత్వ భూమికి రెక్కలు వచ్చాయి.1966 నుంచి ఉన్నరిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోను..అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నపట్టా,పహాణీల్లోను ఏది చూసినా తేడాలే కనిపిస్తున్నాయి. చెప్పేదొకటి..చేసేది మరొకటిలా ఉన్నాయి.
అపర్ణ పేరు.. గత వైభవమేనా..?
అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ లో రియల్ రంగానికి దిక్సూచి. ఆ బ్రాండ్ తోనే అమెరికాలో ఉంటున్నవాళ్లైనా.. అమలాపురంలో ఉన్నవారైనా, కేవలం ఆ పేరు వినే కొనుగోలు చేస్తారు. 24 యేళ్ల నుంచి అదే నమ్మకంతో ప్రతి ప్రాజెక్ట్ లో ఎలాంటి వివాదం లేకుండా క్లియర్ టైటిల్ తో ..ఎంతో నాణ్యమైన నిర్మాణాలు చేసి వినియోగదారుల కలల సౌధాలను నిర్మించారు.
వినియోగదారులు ఒక్కసారి ఫ్టాట్ కొంటే.. మరొక్కసారి అపర్ణలో తప్ప.. మళ్లీ మరో ఇతర నిర్మాణ సంస్థ జోలికి పోరని టాక్ ఉంది. ఇతర బిల్డర్లకు మించి పేరు రావడానికి కారణం నాణ్యతలో,భూ వ్యవహారాల్లో ఎక్కడా కాంప్రమైజ్ కారని.. భూముల కొనుగోలు టైటిల్ క్లియర్ గా ఉంటేనే ఎంట్రీ అవుతారని అపర్ణ యాజమాన్యానికి పేరుంది. ప్రభుత్వ భూములు,అసైన్డ్,చెరువుల జోలికి అసలే వెళ్లరు.కాని పేట్ బషిరాబాద్ లో మాత్రం..అపర్ణ సెరినిటీలో అన్ని నిర్మాణ సంస్థలు వెళ్లినట్లే … అడ్డుతోవల్లో వెళ్లినట్టు అనిపిస్తోంది.
ఏం జరుగుతోంది..గుర్తించిన తొలివెలుగు !
తెలంగాణలో ప్రభుత్వ భూములను కాజేస్తున్నవ్యవహారాన్నితొలివెలుగు క్రైం బ్యూరో ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతోంది. అయితే అపర్ణ నిర్మాణ సంస్థ వ్యవహారం పై మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించింది. వారు అనుమతుల కోసం సమర్పించిన డాక్యుమెంట్లని పరిశీలించింది. డెవలప్మెంట్ కి ఇచ్చిన బి. తేజ రాజు, బి. రామ రాజు, బి. సత్యనారాయణ రాజు, బి. రాహుల్ రాజుల పేర్లపై ఉన్న పహాణీలు, వాళ్లు సమర్పించిన లింకు డాక్యుమెంట్లపై పరిశోధన చేసింది. నర్మద గ్రీన్ ల్యాండ్స్ తో పాటు 120 మంది తో ఉన్నవివాదాస్పద భూముల్లోని ప్లాట్స్ కొనుగోలు చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నింటిని మూడేళ్ల క్రితం చక్రం తిప్పి.. రెవెన్యూ అధికారులను ఏమార్చి.. సర్వే నెంబర్ 25/1 భూముల్లో మాయ చేశారు. ఈ విషయం పై అపర్ణ వారిని అప్రమత్తం చేసేందుకు వివరాలు కోరాం. వారం క్రితం మెయిల్ చేసి సరిచూసుకోవాలని సూచనలు కూడా చేసింది తొలివెలుగు.పట్టాదారులు అని చెప్పుకునే వారు ఎలా మాయ చేశారో.. మరో కథనంలో చూద్దాం.