ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్లో కొన్ని వస్తువుల ధరలు పెంచితే కొన్నింటి రేట్లు తగ్గించారు. ముఖ్యంగా సిగరెట్లపై కస్టమ్స్ సుంకాన్ని 16 శాతం పెంచారు. గత మూడేళ్ళుగా ఈ సుంకాన్ని పెంచని ప్రభుత్వం ఈ సారి ఈ చర్య తీసుకుంది. తాజా పెంపుతో దేశంలో వివిధ బ్రాండ్ల సిగరెట్ల ధరలు పెరగనున్నాయి. సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.
గాడ్ ఫ్రే ఫిలిప్స్ షేర్లు 4.29 శాతం క్షీణించగా, గోల్డెన్ టొబాకో 3.81 శాతం, ఎన్టీవీ ఇండస్ట్రీ 1.4, ఐటీసీ షేర్లు 0.78 శాతం పడిపోయాయి. సిగరెట్లపై నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ డ్యూటీ పెంచిన కారణంగా గోల్డ్ ఫ్లేక్, సిల్క్ కట్ వంటి కంపెనీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇక ప్రజలు ఎక్కువగా వాడే మొబైల్ ఫోన్లు, ఫోన్ ఛార్జర్లు, టీవీలు, ఇమిటేషన్ జువెల్లరీ, చాక్లెట్లు, లెదర్, రసాయనాలు, ఆటబొమ్మలు, ఎలెక్ట్రిక్ వాహనాలు, సైకిళ్ళు, లిథియం ఐయామ్ సెల్ బ్యాటరీలు, కెమెరా లెన్సుల ధరలు తగ్గనున్నాయి.
టీవీ ప్యానెల్స్ విడిభాగాలపై కస్టమ్స్ సుంకాన్ని 2.5 శాతం తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కానీ స్మార్ట్ వాచీలు, ఇయర్ బడ్స్, గోల్డ్, వెండి, ప్లాటినం వస్తువుల ధరలు పెరగనున్నాయి. దిగుమతి చేసుకున్న ఆటబొమ్మలు, కిచెన్ వస్తువుల ధరలు కూడా ప్రియం కానున్నాయి.