సైబర్ నేరగాళ్లకు రోజుకో కొత్త రకం మోసంతో ప్రజల వద్ద నుంచి ఏదోక విధంగా డబ్బులు కాజేస్తున్నారు. నిన్నటికి నిన్న కరెంట్ బిల్లుల పేరుతో జరిగిన మోసం గురించి బయటకు వస్తే.. తాజాగా టెలిగ్రామ్ యాప్ ద్వారా ప్రజల వద్ద నుంచి కోటిన్నర కొట్టేసిన ఘటన వెలుగు చూసింది.
కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే నగరానికి చెందిన ముగ్గురిని ట్రాప్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు కాజేసిన తరువాత మెల్లగా యాప్ నుంచి అకౌంట్ డిలీట్ చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోస్ యాడ్స్ పైన క్లిక్ చేస్తే లక్షల్లో కమీషన్లు ఇస్తామని ఆశ పెట్టి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం ఇద్దరి నుంచి కోటికి పైగా కాజేయగా తాజాగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ట్రాప్ చేసి ఇరవై లక్షలకు పైగా టోకరా వేశారు. యువతుల ఫోటోలను డీపీలుగా పెట్టి యూజర్స్ ను ఆకర్షిస్తున్న చీటర్స్.
టెలిగ్రామ్ యాప్ లో ఫోన్ నెంబర్ హైడ్ ఆప్షన్ ను అనుకూలంగా మార్చుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారు. అందిన కాడికి దోచేసి తర్వాత టెలిగ్రామ్ లో అకౌంట్ డిలీట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.